చెత్త ఏరుకునే సాకుతో దొంగతనాలు.. నలుగురు మహిళలు అరెస్ట్#AndariTV #AndariTVDigitalNews #Mahabubabad #Kothaguda #Konapuram

Date: 2026-11-04
news-banner

అందరి టీవీ డిజిటల్ న్యూస్;

మహబూబాబాద్ / కొత్తగూడ

చెత్త ఏరుకునే సాకుతో ఇళ్ల వద్దకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మహబూబాబాద్ మండల పరిధిలోని కోనాపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త, ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకునే నెపంతో గ్రామంలోకి వచ్చిన నలుగురు మహిళలు.. గ్రామానికి చెందిన కట్కూరి కృష్ణారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి తాగడానికి మంచినీళ్లు కావాలని అడిగారు.

నీళ్లు తీసుకురావడానికి కృష్ణారెడ్డి ఇంట్లోకి వెళ్లిన సమయంలో బయట ఉంచిన ఎలక్ట్రిక్ వైర్లను తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు.

అరెస్టయిన మహిళల వివరాలు:

  • తూర్పాటి లక్ష్మి (50) – మడికొండ, కాజీపేట మండలం.

  • తూర్పాటి పద్మ – మడికొండ, కాజీపేట మండలం.

  • కడకంచి సారమ్మ (20) – శివాజీనగర్, ఉప్పలగట్టు, వరంగల్.

  • సొగాల సమ్మక్క (28) – శివాజీనగర్, ఉప్పలగట్టు, వరంగల్.

పాత కేసుల్లోనూ నిందితులుగా ఉన్నట్లు పోలీసుల వెల్లడి!

ఈ నలుగురు మహిళలపై గతంలోనూ వివిధ జిల్లాల్లో దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని, జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి:

గ్రామాలు, కాలనీల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనాలకు సంబంధించిన ఘటనలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Leave Your Comments