నర్సంపేట: సెప్టెంబర్ 17ను ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో మరుపురాని, మరుగునపరచలేని చారిత్రక ఘట్టమని రాణి రుద్రమ రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోకి వచ్చిన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా గౌరవించడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అన్నారు.
సెప్టెంబర్ 17కు ‘విలీన దినం’, ‘ప్రజా పాలన దినం’ వంటి పేర్లు పెట్టినంత మాత్రాన చరిత్ర మారదని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చారిత్రక దినోత్సవం స్ఫూర్తిని మరుగునపరచడం సరైన విధానం కాదని విమర్శించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ సహించదు: డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం రెండూ ఒకటే కాదని అన్నారు. వాటి లక్ష్యాలు, రాజకీయ నేపథ్యం, కాలపరిమితి, అంతిమ లక్ష్యాలు వేర్వేరని పేర్కొన్నారు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోకి వచ్చిన వాస్తవాన్ని ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. హైదరాబాద్ విమోచన ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం రెండింటి చరిత్రను వేర్వేరుగా, వాస్తవ ఆధారాలతో పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు.
పరకాల, భైరాన్‌పల్లి వంటి చారిత్రక ఘటనలు, నిజాం నిరంకుశత్వం, రజాకార్ల దమనకాండ గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. నిజాం, రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన జాతీయవాదులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అధికారికంగా స్మరించాల్సిన అవసరం ఉందన్నారు.
“తెలంగాణ విమోచన చరిత్ర ఎవరి సొత్తూ కాదు. అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చరిత్ర. చరిత్రను చరిత్రగానే చెప్పాలి, రాజకీయ రంగులు పులమకూడదు. సెప్టెంబర్ 17 ముమ్మాటికీ తెలంగాణ విమోచన దినోత్సవమే” అని రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 28వ వార్డు కౌన్సిలర్ జూలూరి రోజా రాణి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు గడ్డం ఆంజనేయులు, మాజీ మండల అధ్యక్షులు అబోతు రాజు యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సంగేం శంకర్, నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తడక వినయ్ గౌడ్, చెన్నారావుపేట అధ్యక్షులు శేఖర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విఘ్నేష్ గౌడ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.